YS Sharmila: కూటమి ప్రభుత్వం రైతులకు సంక్షేమం అందించడానికి బదులుగా ఐదు ప్రధాన మోసాలకు పాల్పడిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మంగళవారం ఆరోపించారు. గత 17 నెలల్లో వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం విస్మరించిందని, రైతులను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆమె విమర్శించారు.
“వ్యవసాయం కోసం ఐదు సూత్రాలు కాదు ఐదు మోసాలు – చంద్రబాబు గారివి అని పిలవబడే ఐదు సూత్రాల సంక్షేమం పూర్తిగా బూటకం. 17 నెలలుగా వారు వ్యవసాయాన్ని గాలికొదిలేశారు” అని షర్మిల ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ద్వారా పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం.. ఐదు సూత్రాల ప్రణాళికలో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత సాగు, అగ్రి-టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, రైతులకు ప్రభుత్వ మద్దతు ఉన్నాయి.
ఐదు సూత్రాల ప్రణాళిక కేవలం ప్రచార ఆర్భాటమే
రైతుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ‘ఐదు సూత్రాల ప్రణాళిక’ అనేది కేవలం ప్రచార ఆర్భాటం తప్ప మరొకటి కాదని షర్మిల ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయ నష్టాలకు ప్రభుత్వం స్పందించడంలో విఫలమైందని, సహాయం కోసం రైతుల అత్యవసర విజ్ఞప్తులను పట్టించుకోలేదని ఆమె దుయ్యబట్టారు. గత 17 నెలలుగా ఏ పంటకూ కనీస మద్దతు ధర కల్పించడంలో వైఫల్యం చెందిందని ఆమె ఎత్తి చూపారు. దీనితో రైతులు హెచ్చుతగ్గులకు లోనయ్యే మార్కెట్ ధరల దయపై ఆధారపడాల్సి వచ్చిందన్నారు.
అర్హులైన రైతులకు ఏటా రూ. 20,000 ఆర్థిక సహాయం అందించే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో సగం మంది రైతులకు సహాయం అందలేదని, అంతేకాక అనేక సబ్సిడీ పథకాలను నిలిపివేయడం ద్వారా గ్రామీణ ఇబ్బందులు మరింత పెరిగాయని APCC అధ్యక్షురాలు ఆరోపించారు. టమాటా, ఉల్లి, అరటిపండ్ల ధరలు రూ. 1కి పడిపోయినప్పుడు కూడా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయకుండా కార్యకలాపాలను ముగించిందని కాంగ్రెస్ నాయకురాలు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎరువులు, విత్తనాలను సమయానికి సరఫరా చేయకపోవడం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిందని, చాలా మందిని ఆత్మహత్యల అంచున నిలబెట్టిందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలపై అధికార కూటమి ప్రభుత్వం నుండి తక్షణ స్పందన ఏదీ రాలేదు.
