Justice Surya Kant: సుప్రీం కోర్టు జస్టిస్ సూర్య కాంత్ (Justice Surya Kant) సోమవారం (నవంబర్ 24) భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్య కాంత్‌తో భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఇటీవల జస్టిస్ బి.ఆర్. గవాయి చీఫ్ జస్టిస్ పదవి నుంచి పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో ఇప్పుడు జస్టిస్ సూర్య కాంత్ బాధ్యతలు చేపట్టారు. ఆయన దేశంలో 53వ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.
పదవీ కాలం ఎప్పటి వరకు?
భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ పదవీ కాలం నేటి నవంబర్ 24, 2025 నుండి ఫిబ్రవరి 9, 2027 వరకు ఉంటుంది. నవంబర్ నెల ప్రారంభంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగం జస్టిస్ సూర్య కాంత్ నియామకాన్ని ప్రకటిస్తూ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
హర్యానాలో జననం
జస్టిస్ సూర్య కాంత్ ఫిబ్రవరి 10, 1962న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో అనేక ముఖ్యమైన తీర్పులు ఇచ్చిన జస్టిస్ సూర్య కాంత్ అక్టోబర్ 5, 2018న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ సూర్య కాంత్ ఆస్తులు ఎంత?
అధికారిక రికార్డుల ప్రకారం.. దేశ కొత్త చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ పేరు మీద సొంత వాహనం ఏమీ లేదు. కానీ ఆయన భార్యకు వ్యాగన్ఆర్ కారు ఉంది. ఆయనకు భారతదేశం అంతటా ఆరు నివాస ఆస్తులు, రెండు ప్లాట్లు ఉన్నాయి.
ఆయన ఆస్తుల వివరాలివే
- చండీగఢ్‌లోని సెక్టార్ 10లో ఒక కనాల్ ఇల్లు.
- న్యూ చండీగఢ్‌లోని ఈకో సిటీ-II లో 500 చదరపు గజాల ప్లాట్.
- చండీగఢ్‌లోని సెక్టార్ 18-సిలో 192 చదరపు గజాల ఇల్లు.
- పంచకులాలలోని గోల్‌పురా గ్రామంలో 13.5 ఎకరాల వ్యవసాయ భూమి.
- గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్-I లో 300 చదరపు గజాల ప్లాట్.
- DLF-II లో 250 చదరపు గజాల ఇల్లు.
- న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-I లో 285 చదరపు గజాల ఆస్తిలో గ్రౌండ్ ఫ్లోర్, బేస్‌మెంట్.
- తన స్వగ్రామం హిస్సార్‌లో, పెటర్వార్‌లో 12 ఎకరాల వ్యవసాయ భూమి, పెటర్వార్- హిస్సార్ అర్బన్ ఎస్టేట్-II రెండింటిలోని పూర్వీకుల గృహాలలో మూడవ వంతు వాటా ఉంది.
