Smriti Mandhana: క్రికెటర్ స్మృతి మంధానా (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ వివాహం నవంబర్ 23న సాంగ్లీలో జరగాల్సి ఉంది. కానీ అది హఠాత్తుగా వాయిదా పడింది. వివాహం వాయిదా పడటానికి గల కారణం, పలాష్ మోసం చేశారనే వదంతులపై పలాష్ తల్లి అమితా ముచ్ఛల్ మొదటిసారిగా వివరాలను వెల్లడించారు. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానా గుండె సంబంధిత అనారోగ్యం కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం వల్లే పెళ్లిని వాయిదా వేయాలని పలాష్ ముచ్ఛల్ నిర్ణయం తీసుకున్నారని అమితా ముచ్ఛల్ తెలిపారు.
స్మృతి-పలాష్ వివాహం ఎందుకు వాయిదా పడింది?
పలాష్ ముచ్ఛల్.. కాబోయే మామగారు శ్రీనివాస్ మంధానా మధ్య చాలా సన్నిహిత అనుబంధం ఉందని అమితా ముచ్ఛల్ వివరించారు. “పలాష్‌కి అంకుల్ (శ్రీనివాస్ మంధానా)తో చాలా అనుబంధం ఉంది.. స్మృతి కంటే వీళ్లిద్దరే ఎక్కువ సన్నిహితంగా ఉంటారు” అని ఆమె చెప్పారు. శ్రీనివాస్ మంధానా ఆరోగ్యం క్షీణించడంతో పలాష్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. హల్దీ వేడుక పూర్తయినప్పటికీ “అంకుల్ కోలుకునే వరకు తాను ఏడు అడుగులు వేయబోనని (పెళ్లి చేసుకోబోనని)” పలాష్ నిర్ణయించుకున్నారని ఆయన తల్లి తెలిపారు.
పలాష్ తల్లి చెప్పిన ప్రకారం.. శ్రీనివాస్ మంధానా పెళ్లి ఊరేగింపు ఏర్పాట్లకు ముందు వరకు చాలా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఒక రోజు ముందు కూడా బాగా డ్యాన్స్ చేశారు. కానీ ఆ తర్వాత అస్వస్థతకు గురి కావడంతో వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
పలాష్ ఆరోగ్యం కూడా క్షీణించింది
కాబోయే మామగారి పరిస్థితి చూసి పలాష్ కూడా తీవ్ర ఒత్తిడికి లోనయ్యి, అనారోగ్యం పాలయ్యారు. “ఏడుస్తూ ఏడుస్తూనే (పలాష్) ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. అతన్ని 4 గంటల పాటు ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది. ఐవీ డ్రిప్ ఎక్కించారు. ఈసీజీ కూడా చేశారు. అన్నీ సాధారణంగానే వచ్చాయి. కానీ ఒత్తిడి (స్ట్రెస్) చాలా ఎక్కువగా ఉంది” అని పలాష్ తల్లి చెప్పారు. పలాష్‌ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినప్పటికీ ఆయన తీవ్రమైన ఒత్తిడిలోనే ఉన్నారని ఆమె తెలిపారు.
పెళ్లి ఆగిపోయిన తర్వాత పలాష్ మోసం చేశారనే వదంతులు సోషల్ మీడియాలో వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తల్లి ముందుకు వచ్చి అసలు కారణాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం రెండు కుటుంబాలు శ్రీనివాస్ మంధానా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాయి. ఇంతలో స్మృతి మంధానా, ఆమె స్నేహితులు వివాహ వేడుకకు సంబంధించిన అన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుండి తొలగించారు.
